ఖానాపూర్ కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
జీవో జారీ
స్థల సేకరణలో కాంగ్రెస్ నాయకులు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School) మంజూరు అయినట్లు జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ల నిర్మాణం తలపెట్టిన నేపథ్యంలో ఇదివరకు నిర్మించిన పాఠశాలలకు అదనంగా మరో 20 నియోజకవర్గాలను ఎంపిక చేసి ప్రభుత్వం ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
మంగళవారం ఈ జీవో స్థానిక సోషల్ మీడియాలో విహారం చేస్తుంది. కాగా పాఠశాలకు సుమారు 5 ఎకరాల పైచిలుకు స్థలం అవసరం కాగా ప్రస్తుతం ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు పక్కనే ఉన్న ఎంపీడీవో, ఇతర కార్యాలయాల స్థలాలను కలుపుతూ ఈ పాఠశాల ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ ,11వ వార్డు కౌన్సిలర్ రాజు రా సత్యం తెలిపారు.
కాగా గత కొన్ని నెలలుగా ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే ఉట్నూర్ తరలించుకు పోయాడని ఆరోపిస్తూ ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పాఠశాల ఖానాపూర్ కు మంజూరు కావడం విశేషం.
గతంలో అఖిలపక్షం ఆందోళనల నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ ఖానాపూర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పాఠశాలను ఖానాపూర్ పట్టణానికి మంజూరు చేయించారని స్థానిక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పాఠశాల నిర్మాణానికి స్థలం సేకరణ విషయంలో స్థానిక నాయకులు ఎలా ముందుకు వ
వెళ్తారోనని చర్చించుకుంటున్నారు. కాగా ఈ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11 కోట్ల 90 లక్షలు నిధులు వెచ్చిస్తూ ఫైనాన్సు క్లియరెన్స్ కూడా వచ్చినట్లు తెలుపుతున్నారు. పాఠశాల త్వరితగతిన పూర్తయితే ఖానాపూర్ అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు మేధావులు అంటున్నారు.