కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఏకకాలంలో నాకాబందీ తనిఖీలు

24-10-2026 | 10:59pm

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(Bhadradri Kothagudem District SP Rohit Raju) ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల(Police stations) పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఏకకాలంలో నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్, టూ టౌన్ పరిధిలోని రామవరం మెయిన్ రోడ్, త్రీ టౌన్ పరిధిలోని పాత డిపో, లక్ష్మీదేవిపల్లి పరిధిలోని ఇల్లందు క్రాస్ రోడ్, చుంచుపల్లి బైపాస్, సుజాతనగర్ మెయిన్ రోడ్ సెంటర్, జూలూరుపాడు పరిధిలోని మాచినేనిపేట క్రాస్ రోడ్, చంద్రుగొండ సెంటర్, అన్నపురెడ్డిపల్లి శివాలయం వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడటంతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను తనిఖీ చేయడం ఈ నాకాబందీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.తనిఖీల సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు