గీత కార్మికుల భార్యలకు తక్షణ పెన్షన్‌ విధానం హర్షణీయం

31-10-2026 | 11:02pm

- మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్

హనుమకొండ,(విజయక్రాంతి): గీత కార్మికులు మరణిస్తే వారి భార్యలకు వెంటనే పెన్షన్‌ అందించే విధానాన్ని (ఇన్‌స్టంట్‌) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గీత కార్మికుడు మరణించిన తర్వాత అతని భార్య తిరిగి పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన విధానాన్ని తొలగించాలని గత కొన్నేళ్లుగా పలు గౌడ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయని తెలిపారు.

గౌడ సంఘాల డిమాండ్‌ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, గీత కార్మికులు మరణిస్తే వారి భార్యలకు పెన్షన్‌ అందించే నిర్ణయం తీసుకోవడం పట్ల మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 37,381 మంది గీత కార్మికులకు ఎలాంటి షరతులు విధించకుండా వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని, గీత కార్మికుడు మరణించినప్పుడు అతని భార్య తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మోకుదెబ్బ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తోటకూరి రాందాస్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వల్లాల సదానందం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి గడ్డమీది అశ్విన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి రడం శ్రీనివాస్ గౌడ్, హనుమకొండ పట్టణ గౌరవ అధ్యక్షుడు జూలూరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు