ఎంజీఎం లో ఉద్రిక్త వాతావరణం

22-09-2026 | 10:06pm

దాస్యం వినయ్ భాస్కర్, పోలీసులకు మధ్య తోపులాట

హనుమకొండ, సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): ఎంజీఎం ఆస్పత్రి (MGM Hospital)వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, మౌలిక వసతుల కొరత, రోగుల ఇబ్బందులను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, వరంగల్‌ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ ను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో వినయ్‌భాస్కర్‌ గాయపడినట్లు ఆయన వర్గాలు తెలిపాయి.

కాలు, చేతి నుంచి రక్తస్రావం అయినట్లు పేర్కొన్నారు. ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడటం తో ముగ్గురు సహా పలువురికి గాయాలైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆస్పత్రి భవనం భద్రత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి. మంగళవారం ఉదయం ఎంజీఎం లో రోగులను పరామర్శించి, ఆస్పత్రిలోని పరిస్థితులను తెలుసుకునేందుకు వినయ్‌భాస్కర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద పోలీసులు ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వినయ్‌భాస్కర్‌ ను ఆస్పత్రిలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు.

రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంజీఎం ప్రధాన గేటు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వినయ్‌భాస్కర్‌ గాయపడ్డారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు