కంట్రీ డిలైట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు
పటాన్ చెరు, సెప్టెంబర్ 22: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని చిన్న కంజర్లలో గల బీజాపురి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్(Bijapuri Dairy Private Limited) ప్లాంట్‌లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ల్యాబొరేటరీలో ఆహార నాణ్యత పరీక్షల కోసం జూన్ 2026 నాటికే కాలం చెల్లిన రెసోర్సినాల్ అనే ల్యాబ్ రీఏజెంట్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ల్యాబ్‌లో ఎలాంటి లేబుళ్లు, తయారీ వివరాలు లేని కొన్ని ఫుడ్ ఫ్లేవర్లను కనుగొన్నారు.ప్లాంట్ లోపల ఈగలు, కీటకాలు రాకుండా నిరోధించే కొన్ని ఇన్‌సెక్ట్ ప్రూఫ్ స్క్రీన్స్ తెరిచి ఉంచడాన్ని గమనించారు. అలాగే కొన్ని చోట్ల నేలపై నీరు నిలిచి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్లాంట్ ఆవరణలో లైసెన్స్ కాపీని స్పష్టంగా ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.ప్లాంట్ నుండి పనీర్, పెరుగు ల్యాబ్ శాంపిళ్లను అలాగే పచ్చి పాల సర్వైలెన్స్ శాంపిళ్లను అధికారులు సేకరించి ల్యాబొరేటరీకి పంపించారు.