జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
- జర్నలిస్టులకు ఉచిత కార్పోరేట్ వైద్యం అందించాలి
జడ్చర్ల, సెప్టెంబర్ 22: గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్(journalist Srinivas) కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని,ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి బొల్లెపోగు రాజేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జడ్చర్ల మండల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామంలో నిర్వహించిన శ్రీనివాస్ అంతక్రియలకు వారు హాజరయ్యారు.మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం జడ్చర్ల ఎంఆర్సి వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు ఉన్న జర్నలిస్టు కుటుంబాలకు రాష్ట్రంలోని ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.శ్రీనివాస్ మృతి పట్ల తను పనిచేస్తున్న సంస్థ యాజమాన్యము స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
శ్రీనివాస్ కు వైద్యం అందించడంలో ఆలస్యం కారణంగానే ఆయన మరణించడం జరిగిందని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. సంబంధిత ఆసుపత్రి పై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ మరణం మాదిగ జర్నలిస్టు ఫోరంకు తీరనిలోటని,ఆయన కుటుంబానికి తమ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.