దళితులపై దాడులను సహించేది లేదు

23-10-2026 | 06:48pm

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎల్క కమలాకర్

మల్లాపూర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి):దళితులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం(All India Ambedkar Youth Association) జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్క కమలాకర్ హెచ్చరించారు. శుక్రవారం మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో దాడికి గురైన దళిత కుటుంబాన్ని డివిజన్ అధ్యక్షుడు శోభన్‌తో కలిసి ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ వేంపల్లి గ్రామంలో దుర్గాదేవి నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న దళిత మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దళితులు, పేద వర్గాలపై జరిగే దాడులను ప్రభుత్వాలు ఏమాత్రం ఉపేక్షించకూడదని అన్నారు.ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన బాధితులు, వారి కుటుంబ సభ్యులపై తిరిగి దూషణలు, దాడులు జరగకుండా పోలీసులు తగిన రక్షణ కల్పించాలని కోరారు.

ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసును సమగ్రంగా విచారించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు