కులవివక్షకు తావులేకుండా ఐకమత్యంతో జీవించాలి
సామాజిక సమరసతతోనే సమాజ అభ్యున్నతి సాధ్యం: అప్పాల ప్రసాద్.
కోనరావుపేట, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గ్రామాల్లో కులవర్గ భేదాలకు(Caste differences) అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో జీవిస్తూ, పండుగలు, జాతరలు, ఉత్సవాలను కలిసికట్టుగా నిర్వహించుకోవాలని అఖిల భారత సామాజిక సమరసత వేదిక(All-India Social Harmony Forum) కళా ప్రముఖ్, తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్(Appala Prasad) పిలుపునిచ్చారు.అంటరానితనం, కులవివక్షకు సమాజంలో ఎలాంటి స్థానం ఉండకూడదని, ప్రతి ఒక్కరినీ సమాన గౌరవంతో చూడాలని సూచించారు.
సామాజిక సమరసత వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ఆధ్వర్యంలో గురువారం కోనరావుపేట మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాల కుల పెద్దలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో పరస్పర ప్రేమ, ఆప్యాయత, సోదరభావం పెంపొందించుకోవాలని అన్నారు. గ్రామీణ సమాజంలో ఐకమత్యం, పరస్పర సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
గ్రామాల్లో నిర్వహించే పండుగలు, జాతరలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర సామాజిక ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, అపోహలు తొలగిపోయి సామాజిక ఐక్యత బలోపేతమవుతుందని వివరించారు. కులాల మధ్య పరస్పర గౌరవం,స్నేహభావం పెంపొందించడం ద్వారా ఆదర్శ గ్రామ సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు.
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కులవివక్షను దూరం చేస్తూ, సమానత్వం, మానవత్వం, సోదరభావం వంటి విలువలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లోని కుల పెద్దలు, సామాజిక ప్రముఖులు పరస్పర సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమావేశాల ద్వారా సామాజిక సమరసతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
కుల పెద్దలకు సన్మానం
ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి హాజరైన కుల పెద్దలు తమ అభిప్రాయాలను, సందేశాలను వెల్లడించారు.అనంతరం సమావేశానికి హాజరైన వివిధ గ్రామాల కుల పెద్దలను సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ విభాగ్ కో-కన్వీనర్ మోర శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బోడ రవీందర్, కన్వీనర్ సుంకోజి రమేష్ చారి, ఉపాధ్యక్షుడు కోడం రవి, నిర్వాహకులు జనమంచి భరత్ శర్మ, కస్తూరి రాజేందర్ రెడ్డి, చల్ల జితేందర్ రెడ్డి, భీమనపెల్లి కృష్ణకాంత్, ఎరవెల్లి స్వామి దాసు, జయరాం నాయక్, రామచంద్రం, మిర్యాల్కర్ బాలాజీ, జయశ్రీ, సంజీవ్‌తో పాటు వివిధ గ్రామాల పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.