నీటి వృథా చేస్తే కఠిన చర్యలు
చెత్త వేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా
ఆదిలాబాద్ జిల్లా అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఇచ్చోడ గ్రామంలో నీటి సంరక్షణ, పరిశుభ్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇచ్చోడ గ్రామ సర్పంచి జలై జాకు హెచ్చరించారు. భగీరథ నీటిని(Bhagiratha water) అవసరం లేకుండా వృథా చేస్తే సంబంధిత ఇంటి నల్లా కనెక్షన్ తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలంతా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతి ఇంటితోపాటు వాటర్ సర్వీసింగ్ కేంద్రాల్లోనూ ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని సర్పంచి తెలిపారు. వీటి నిర్మాణానికి సంబంధించిన ఖర్చును వీబీజీ రాంజీ పథకం ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ బోర్ల నుంచి నిర్ణీత సమయాల్లోనే నీటిని తీసుకోవాలని, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.గ్రామంలో రోడ్లపై, ఖాళీ స్థలాల్లో, వాగుల సమీపంలో చెత్తను పడేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇంట్లోని చెత్తను చెత్త సేకరణ బండి వచ్చినప్పుడు అందులోనే వేయాలని సూచించారు. చెత్త సేకరణ బండి రాకపోతే సంబంధిత వార్డు సభ్యులను సంప్రదించాలని తెలిపారు.అలాగే రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని సూచించారు.
గ్రామంలో పరిశుభ్రతను కాపాడటం, నీటిని సంరక్షించడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడటంలో ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించి గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు.ఇచ్చోడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచి జలై జా, ఈవో సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి శిరీష్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.