కేజీబీవీ జగిత్యాలలో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం
జగిత్యాల, అక్టోబర్ 29 ( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ( డి ఎల్ ఎస్ ఎ)(District Legal Services Authority) కార్యదర్శి సరిత మట్టా జగిత్యాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో విద్యార్థినులకు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోక్సో చట్టంపై రూపొందించిన అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాట్లాడుతూ పోక్సో చట్టం, 2012 అనేది 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అశ్లీల కార్యకలాపాల నుంచి రక్షించడానికి రూపొందించిన ప్రత్యేక చట్టమని వివరించారు. బాలబాలికలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించి ఈ చట్టం కఠినమైన నిబంధనలను కలిగి ఉందని తెలిపారు.
విద్యార్థినులకు తమ శరీరంపై తమకు హక్కు ఉందని, ఎవరైనా అనుచితంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక ఉద్దేశంతో బెదిరించడం లేదా ఆన్లైన్లో అసభ్యకరమైన సందేశాలు పంపడం వంటి చర్యలను నిర్లక్ష్యం చేయకూడదని వివరించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాల సమాచారం అందినప్పుడు చట్టబద్ధమైన విధానంలో సంబంధిత అధికారులకు నివేదించడం ముఖ్యమని, బాధిత పిల్లల గోప్యతను కాపాడటం, వారికి గౌరవప్రదమైన, బాలల అనుకూల వాతావరణాన్ని కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పిల్లల భద్రత అనేది కుటుంబం, పాఠశాల మరియు సమాజం అందరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో చట్టపరమైన హక్కులపై అవగాహన పెంపొందించడంతో పాటు, లైంగిక వేధింపులను గుర్తించడం, వాటిని నివేదించడం, సురక్షితమైన వాతావరణంలో విద్యను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.