డంపింగ్ యార్డ్ పై బిజెపి వైఖరి స్పష్టం చేయాలి

29-10-2026 | 06:23pm
  1. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎంపీ ఈటెల పాదయాత్ర
  2. డిసిసి అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్ 

మేడ్చల్, అక్టోబర్ 29(విజయ క్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) పై బిజెపి వైఖరి స్పష్టం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్(Congress Committee President Vajresh Yadav) డిమాండ్ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం హైదరాబాదు నగరం నలుదిక్కుల డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంటే బిజెపి ఎంపీలు రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో   అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఏ ప్రాంతంలోని చెత్త ఆ ప్రాంతానికి తరలించడానికి బిజెపి ఎంపీలు అడ్డు తగులుతుండగా, మరోవైపు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడికక్కడ డంపింగ్ యార్డ్ లు ఏర్పాటు చేస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై భారం తగ్గుతుందన్నారు. బిజెపి ద్వంద వైఖరి అవలంబిస్తుందని, పాదయాత్ర ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పాదయాత్ర కార్యక్రమం చేపట్టారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలని కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితమే మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయించారని, దీనికి ఎంపీ ఈటెల రాజేందర్ అధ్యక్షత వహించారని గుర్తు చేశారు.

సమస్య పరిష్కార బాధ్యతను ఎంపీ ఈటెల రాజేందర్ కు అప్పగించారని, సమస్య పరిష్కార మార్గం చూడకుండా సీఎం ను విమర్శించడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో బిజెపి నాయకులు సీఎంను విమర్శిస్తే ఊరుకునేది లేదని వజ్రెష్ యాదవ్ స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం విషయంలో అన్ని పార్టీల అగ్ర నాయకులు సమావేశం కావాల్సిన అవసరం ఉందన్నారు.

తాను పిసిసి అధ్యక్షుడిని సమావేశానికి తీసుకు వస్తానని, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు కూడా తమ అధ్యక్షులను తీసుకురావాలన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో జవహర్ నగర్ లో చెత్త పేరుకు పోయిందని, సరైన చర్యలు తీసుకోలేదని, ఆ పార్టీ నాయకులు హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి డంపింగ్ యార్డుల ఏర్పాటును అడ్డుకున్నారన్నారు.

విలేకరుల సమావేశంలో దమ్మైగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పా రామారావు, జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, డంపింగ్ యార్డ్ జేఏసీ కన్వీనర్ ఏనుగు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉదండపురం సత్యనారాయణ, కిష్టాపూర్ పూడూరు డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, గౌడవెల్లి బాల్ రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు