పుష్కరాల నాటికి కాళేశ్వర ఆలయ పనులు పూర్తి చేయాలి

29-10-2026 | 06:13pm
  1. మార్చి నాటికి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం కావాలి
  2. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్
  3. ఆలయ నిర్మాణ పనుల పరిశీలన

భూపాలపల్లి/కాళేశ్వరం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ(Kaleshwara Mukteshwara Swamy Temple) పునర్నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు.

ఆలయ అభివృద్ధితో పాటు అష్టతీర్థాల ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆమె కాళేశ్వరంలో పర్యటించారు. ప్రధాన ఆలయం, రామాలయం, జ్ఞానవాపి బావి, శుభానందిని అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

విజయ గణపతి ఆలయ నిర్మాణ ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతి ఘాట్‌ను సందర్శించి అష్టతీర్థాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, భూసేకరణ, బోట్‌ జెట్టీ ఏర్పాటుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆలయ ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పనుల పురోగతి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ వేగం తగ్గించరాదన్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, మండపాల నిర్మాణాలను నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అష్టతీర్థాల ఘాట్ల ఫౌండేషన్‌ డ్రాయింగ్‌లు, డ్రైనేజీ, విద్యుత్‌ డిజైన్లను త్వరగా ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచడంతో పాటు కార్మికుల సంఖ్యను పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఆలయ నిర్మాణ పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. తాను ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తానన్నారు. కాళేశ్వరాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా పుష్కరాల అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని ఆదేశించారు.

దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.195 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అష్టతీర్థాల ఘాట్లు, రహదారులు తదితర అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించామని, పుష్కరాల నాటికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు.

కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ఘాట్ల నిర్మాణానికి ఇప్పటికే 13 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మరో 18 ఎకరాల భూసేకరణకు గ్రామస్థులతో చర్చించి నిబంధనల ప్రకారం పరిహారం అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన డ్రాయింగ్‌లు అందిన వెంటనే ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఆలయ తలుపులు, ధ్వజస్తంభాలు, కలశాలకు బంగారు లేదా వెండి తాపడం చేయించేందుకు దాతలను గుర్తించి విరాళాలు సమీకరించాలని ట్రస్ట్‌ బోర్డు సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, సబ్‌ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఇంజినీరింగ్ అధికారులు, పర్యాటక శాఖ ప్రతినిధులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు