వ్యవసాయంలో డిజిటల్ సేవలు విస్తరించాలి

31-10-2026 | 06:33pm

- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ,(విజయక్రాంతి): వ్యవసాయ రంగం(Agricultural Sector)లో డిజిటల్ సేవలను విస్తృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రిస్టాక్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అగ్రిస్టాక్ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీలు అగ్రిస్టాక్ లో కీలకమన్నారు. రైతు గుర్తింపు సంఖ్య, గ్రామ మ్యాపులు, పంటల సాగు వివరాలు ఇందులో ఉంటాయని వివరించారు. డేటా నమోదులో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు పంట నమోదు 94 శాతం, రైతు ఐడీల నమోదు 78 శాతం పూర్తయిందని, గ్రామాల మ్యాపుల జియో రిఫరెన్స్ పూర్తయిందని తెలిపారు.

అగ్రిస్టాక్ ద్వారా ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు, పంటల బీమా, రుణాలు, పీఎం కిసాన్ వంటి సేవలను పారదర్శకంగా అందించవచ్చని పేర్కొన్నారు. రైతు ఐడీ ద్వారా భూ వివరాలు, సర్వే నంబర్లు, ఏ పథకాలకు అర్హులో గుర్తించవచ్చన్నారు. నిర్దేశిత గడువులోగా అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ బలరామ రావు, వ్యవసాయ ఏడీ అంబికా సోని, సీపీఓ చినకోట్యా నాయక్, ఉద్యానవన అధికారి నర్సయ్య, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, పశుసంవర్ధక అధికారి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు