రేపు మంథనికి గణపతి సచ్చిదానంద స్వామీజీ రాక
పార్టీలకు అతీతంగా తరలిరావాలని టీసీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు పిలుపు
ధన్వాడ, మంథని పట్టణాల్లో స్వామీజీ పర్యటన
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
మంథని,(విజయక్రాంతి): అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ(Avadhoota Datta Peethadhipathi Sri Ganapathy Sachchidananda Swamy) నవంబర్ 1వ తేదీన మంథని నియోజకవర్గంలో పర్యటించనున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC Secretary Dudilla Srinu Babu) తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామీజీ ఆశీస్సులు అందుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ప్రత్యేక చొరవతో మైసూర్ నుంచి స్వామీజీని మంథని ప్రాంతానికి ఆహ్వానించినట్లు శ్రీను బాబు పేర్కొన్నారు. మంత్రి ఆధ్వర్యంలో పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను విస్తృతంగా పూర్తి చేశామన్నారు. ఆధ్యాత్మిక, భక్తి మార్గాల ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య దర్శనం ఈ ప్రాంత ప్రజలకు దక్కడం ఎంతో అదృష్టమని, వారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటా శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఉదయం 10:00 గంటలకు ధన్వాడ గ్రామంలో మధ్యాహ్నం 2:00 గంటలకు: మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్ ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల చైర్మన్లు, మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.