5 September, 2026 | 2:11 PM

సింగరేణిలో రాజకీయ జోక్యం తగదు: మాజీ ఎమ్మెల్యే గండ్ర

05-09-2026 | 01:35pm

కేటీకె 8వ గని గేట్ మీటింగులో పాల్గొన్న గండ్ర 

కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ 

గణపురం, సెప్టెంబర్ 05 ( విజయక్రాంతి ): సింగరేణిలో రాజకీయ జోక్యం తగదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) అన్నారు. సింగరేణి(Singareni) భూపాలపల్లి ఏరియాలోని గణపురం మండల పరిధిలో గల కేటీకె 8వ గనిలో టీబీజికేఎస్(TBJKS) ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగులో గండ్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికి కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

కార్మికులకు కనీస పనిముట్లు, నాణ్యమైన భద్రతా పరికరాలు, షూలు వంటి అవసరమైన సౌకర్యాలు కూడా సక్రమంగా అందించలేని దుస్థితి నెలకొందని అన్నారు. కార్మికుల సంక్షేమం కంటే సింగరేణిలో రాజకీయ జోక్యం, టెండర్లు, ఆర్థిక వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపించారు.

సింగరేణి ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది, సంస్థ లాభాలు ఎందుకు తగ్గాయి,  ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు అనే అంశాలపై ప్రభుత్వం, యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండేళ్లుగా డీఎంఎఫ్‌టీ నిధులు సక్రమంగా అందడం లేదని, సింగరేణి వద్ద నిధులు లేవని చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వం, జెన్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని కోరారు. 

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా సకాలంలో నిర్వహించడం లేదని, ఎన్నికలు నిర్వహించకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని, సంస్థలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు