50 ఏళ్లుగా అదే భవనం.. మారని యూబీఐ బ్యాంకు తీరు

31-10-2026 | 05:15am
  1. ఖాతాదారులకు తప్పని తిప్పలు
  2. వేలాది ఖాతాదారులు.. వసతులు మాత్రం నిల్
  3. బ్యాంకుకు వెళ్తే గంటల నిరీక్షణ.. కనీస త్రాగు నీరు కరువే 

గణపురం, అక్టోబర్ 30 (విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని యూనియన్ బ్యాంకు(Union Bank) ఖాతాదారులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యానికి గురవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 50 సంవత్సరాలుగా ఒకే  భవనంలో బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, ఖాతాదారుల సంఖ్య వేలల్లో పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచడంపై అధికారులు దృష్టి సారించడం లేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకులో సరిపడా సిబ్బంది లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చే ఖాతాదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు, వృద్ధులు, ఇతర ఖాతాదారులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. బ్యాంకులో మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫాల్స్ సీలింగ్ కూలి.. తప్పిన ప్రమాదం

ఇటీవల బ్యాంకు భవనంలో ఫాల్స్ సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం తప్పిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. భవనం పరిస్థితి, ఖాతాదారుల భద్రతపై అధికారులు తక్షణమే దృష్టి సారించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు.

ఖాతాదారులు పెరుగుతున్నా కనీస వసతులు కరువే

రోజురోజుకు ఖాతాదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ పాత భవనం, పరిమిత సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో బ్యాంకుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు మండలంలోని అతిపెద్ద బ్యాంకు గా యూనియన్ బ్యాంకు ఉండడం వేలాది ఖాతాదారులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి కొత్త భవనం ఏర్పాటు చేయడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించి, మరుగుదొడ్లు, తాగునీరు, కూర్చునే సౌకర్యాలు కల్పించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.

బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వేలాది మంది ఖాతాదారులు ఉన్న అందుకు అనుగుణంగా భవన సముదాయం లేదు 50 ఏళ్ల నుండి ఓకే భవనంలో బ్యాంకు నిర్వహణ కొనసాగుతుంది. వందల మంది ఖాతాదారులున్న సమయంలో ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం 20 వేలకు పైగా ఖాతాలు ఉన్నప్పటికీ అందుకు సరిపడా వసతులు మాత్రం కల్పించడం లేదు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు తమ రుణ చెల్లింపుల విషయంలో వచ్చిన సమయంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. కనీసం బ్యాంకులో మరుగుదొడ్లు మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు తాగునీటి వసతి కూడా లేదు.

కండె రవి, ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు

మరిన్ని వార్తలు