సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా!

31-10-2026 | 05:25am
  1. దీపావళి పండుగకూ బోనస్
  2. నవంబర్ 5న ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ
  3. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 
  4. 38 వేల మందికి రూ.419 కోట్లు  
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి 

హైదరాబాద్, అక్టోబరు 30 (విజయక్రాంతి): ఇటీవలే దసరా పండుగ కానుకగా భారీగా లాభాల వాటా బోనస్ అందుకున్న సింగరేణి కార్మికుల(Singareni Workers)కు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. దీపావళి పండుగకూ బోనస్‌ను చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సింగరేణి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్ (Diwali Bonus)ను నవంబర్ 5న చెల్లించాల్సిందిగా యాజమాన్యాన్ని ఆదేశించారు.

దీపావళి బోనస్‌గా రూ.419 కోట్లను చెల్లించనున్నట్లు, ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చొప్పున లబ్ధి చేకూరుతుందని వివరించారు. రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి విస్తరణకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. లాభాల వాటా కింద ఈ నెలలో దాదాపు 600 కోట్ల రూపాయలు చెల్లించగా.. తాజాగా రూ.419 కోట్ల దీపావళి బోనస్ చెల్లించబోతున్నట్లు తెలిపారు. బొగ్గు రంగంలో పోటీని అధిగమించేందుకు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలపై సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంబంధిత పర్సనల్, ఫైనాన్సు అధికారులతో మాట్లాడి నవంబర్ 5వ తేదీన దీపావళి బోనస్ ను కార్మికుల బ్యాంకు ఖాతాల్లో చెల్లింపునకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకే వర్తింపు

దీపావళి బోనస్ కేవలం ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. ఇది అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల విభాగంలో 190 పని దినాలు, ఓపెన్ కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తిస్థాయిలో బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ పని దినాల హాజరు కలవారికి వారు పని చేసిన కాలానికి నిష్పత్తి ప్రకారం బోనస్‌ను లెక్క కట్టి చెల్లించనున్నారు. అయితే ఈ బోనస్ పొందడానికి కనీస అర్హతగా గత ఆర్థిక సంవత్సరంలో ఏ కార్మికుడైనా కనీసం 30 రోజులు పని చేసి ఉండాలని నిర్ణయించారు.

మొత్తం మీద  సుమారు 38,000  మంది ఉద్యోగులకు బోనస్ వర్తించనుంది. నెల రోజుల వ్యవధిలోనే దసరా, దీపావళి బోనస్‌ల రూపంలో సగటున దాదాపు 2,65,000 రూపాయలు కార్మికులకు అందనున్నాయి. సింగరేణి యాజమాన్యం ఈ రెండు బోనస్‌ల కింద కార్మికులకు సుమారు రూ.1,020 కోట్ల రూపాయలను చెల్లించింది.  సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సింగరేణి ఉద్యోగులకు తన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికులు బోనస్‌ల సొమ్మును తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని, అవకాశం ఉంటే పొదుపు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ పండుగల స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేయాలని గనుల వారీగా, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని కోరారు.

మరిన్ని వార్తలు