పాఠశాల దశ నుండే చట్టాలపై అవగాహన అవసరం

31-10-2026 | 10:50pm

సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి తాడూరు మహతి వైష్ణవి

భూపాలపల్లి,(విజయక్రాంతి): పాఠశాల దశ నుండే చట్టాలపై అవగాహన అవసరం అని సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి(Senior Civil Judge Tadooru Mahathi Vaishnavi) అన్నారు. జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీచే ప్రారంభించబడిన సురక్షిత్ బచ్‌పన్ అభియాన్(Surakshit Bachpan Abhiyan), పిల్లలను రక్షించడానికి ఉద్దేశించిన దేశవ్యాప్త ప్రచారంలో భాగముగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కాటారంలోని ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించగా సీనియర్ సివిల్ జడ్జి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ బంగారు భవిష్యత్తు నేటి బాలల పరిరక్షణతో సాధ్యమని అన్నారు. పోక్సో నేరాల నివారణ, సైబర్ మోసాల నుండి పిల్లల్ని కాపాడుకోవడం మన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలో జరిగిన మరో కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బిడ్డ బాల్యం మనందరి బాధ్యత అని, చాలా మంది పిల్లలకు తమ హక్కులు తెలియవని, సహాయం ఎలా పొందాలో తెలియదని దాన్ని మార్చడమే ఈ ప్రచారం లక్ష్యం అని పేర్కొన్నారు.

గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాల జరిగిన మరో కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ ఆర్. దిలీప్ కుమార్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్షలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటస్వామి, సూపరింటెండెంట్ రఘురాం, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు