క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి
డీఈవో మల్లికార్జున్
తాడ్వాయి,అక్టోబర్, 29( విజయ క్రాంతి): క్రీడలు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని కామారెడ్డి జిల్లా డిఇఓ మల్లికార్జున్(Kamareddy District DEO Mallikarjun) తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఎస్ జి ఎఫ్ మూడు రోజుల క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
విద్యార్థులకు ప్రతి సంవత్సరం మండల స్థాయిలో క్రీడలు నిర్వహించడంతో విద్యార్థులలో మనోధైర్యం పెరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులే రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.ఇక్కడ కబడ్డీ,కోకో, వాలీబాల్ క్రీడలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
విద్యార్థులకు ఆటలు ఆడుకోవడానికి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంచి మైదానం ఉందని ప్రతిరోజు క్రీడల్లో తర్ఫీదు పొందాలని సూచించారు.మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడల్లో విద్యార్థులు మంచి ప్రతిభను కనబరచాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరిని ఆకట్టుకుంది.
అనంతరం విద్యార్థులు నృత్యాలు చేసి అందరిని ఆకట్టుకున్నారు.ఈ క్రీడలు నిర్వహించడానికి దోహదం చేసిన దాతలు అయిన ముసుకు భూపాల్ రెడ్డి,భోగ నరేందర్, అంబీర్ వినోద్ రావు, పైడి రాజేశ్వర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజా గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, ఎంపీడీవో భరత్ కుమార్, ఎంఈఓ రామస్వామి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రావతి, సర్పంచులు రవీందర్ రెడ్డి, ఉపసర్పంచు లు ప్రభాకర్ రెడ్డి, మహేందర్ ప్రధానోపాధ్యాయులు కళ్యాణి,సంగారెడ్డి పి ఆర్ టి యు మండల అధ్యక్షులు రామచందర్ రెడ్డి, పీఈటీలు నగేష్, సంగాగౌడ్,రాములు శారద తదితరులు పాల్గొన్నారు.