మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
మహదేవపూర్/ కాళేశ్వరం, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): మైనర్ బాలికపై లైంగిక దాడికి(Sexual assault) పాల్పడి, ఆమె ఆత్మహత్యకు కారణమైన నిందితుడు గోల్కొండ రాజశేఖర్‌కు భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్(Justice J. Jeevan Kumar) మంగళవారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన మైనర్ బాలిక 2021 డిసెంబర్ 9న ఆధార్ కార్డు మార్పు కోసం కాటారం వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉండగా, పరిచయస్తుడైన రాజశేఖర్ తన ద్విచక్రవాహనంపై ఆమెను తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో బెదిరించి చింతకాని క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక కాటారంలో గడ్డి మందు సేవించి ఇంటికి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
బాలిక బాబాయి ఫిర్యాదు మేరకు అప్పటి కాటారం ఎస్‌హెచ్‌ఓ ఏఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేశారు. అప్పటి కాటారం సీఐ రంజిత్ రావు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం సాక్ష్యాధారాలను సేకరించి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.కేసు విచారణలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జున రావు, ఎస్‌ఐ సీహెచ్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోర్టు లైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ జి. వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ కె. రమేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్. విష్ణువర్ధన్ రావు, జి. వెంకట్రామ్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అభినందించారు.