ఎల్నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుదల

13-10-2026 | 10:02pm
  1. నిరంతర సరఫరాకు టీజీఎన్‌పీడీసీఎల్‌ ప్రత్యేక చర్యలు
  2. టీజీఎన్‌పీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఎన్‌. సదానందం

గణపురం, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా భూపాలపల్లి సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని టీజీఎన్‌పీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఎన్‌. సదానందం(TGNPDCL Superintending Engineer N. Sadanandam) తెలిపారు. మంగళవారం ఆయన గణపురం, చెల్పూర్ సబ్ స్టేషన్ లను సందర్శించారు. సబ్ స్టేషన్ల నిర్వహణ విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లతో పాటు ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. 2025తో పోలిస్తే 2026 సెప్టెంబర్‌లో విద్యుత్‌ వినియోగం 91 శాతం పెరిగిందని, సెప్టెంబర్‌లో గరిష్ఠ డిమాండ్‌ 222.88 మెగావాట్లకు చేరిందని తెలిపారు. పెరిగిన భారాన్ని తట్టుకునేందుకు ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచడంతో పాటు అత్యవసర మరమ్మతులు, సరఫరా పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

డిసెంబర్‌ 2023 నుంచి సెప్టెంబర్‌ 2026 వరకు 3 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 97.2 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 825 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరో 3 సబ్‌స్టేషన్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.

వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మరో 6 సబ్‌స్టేషన్లు, 7 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 122 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్‌ఈ సదానందం పేర్కొన్నారు. డిఇ ఎం ఆర్ టి, కన్స్ట్రక్షన్ జగదీశ్, ఏడిఈ ఆపరేషన్  భూపాలపల్లి -సుందర్ కుమార్ గణపురం ఎఈ వెంకటరమణ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు