సుల్తానాబాద్ లో కార్డన్ సెర్చ్

13-10-2026 | 10:19pm

సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు సీజ్

సుల్తానాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్‌లో మంగళవారం సాయంత్రం  సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు  హాజరై స్థానిక ప్రజలను, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.

మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం వంటి చట్టవిరుద్ధకార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు తెలియజేయకూడదని సూచించారు.

అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.రోడ్డు భద్రతా నియమాలపై యువతకు అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను కలిగి ఉండాలని,

రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.ప్రజల భద్రతను కాపాడటం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా ఇటువంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్, ఎస్ఐ అశోక్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు