జాబ్ మేళాలో మంత్రి శ్రీధర్‌బాబు
- ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- యువత భవితకు బాటలు వేస్తున్న ప్రభుత్వం
- నైపుణ్యాలు పెంచుకోండి.. ఉన్నత వేతనాలు పొందండి
- చదువుతో పాటు నైపుణ్యాలు.. యువతకు ఉజ్వల భవిష్యత్తు
- భూపాలపల్లిలో రెండు గంటల్లోనే 600 మందికి ఎంపిక
భూపాలపల్లి, అక్టోబర్ 09 (విజయ క్రాంతి): ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ(Recruitment for government jobs) చేయడం జరిగిందనియువత భవితకు ప్రజా ప్రభుత్వం బాటలు వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) అన్నారు. నిరుద్యోగ యువతకు(Unemployed youth) ఉపాధి అవకాశాలు(Employment opportunities) కల్పించడమే లక్ష్యంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు(Mega Job Fair) విశేష స్పందన లభించింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై వివిధ కంపెనీల ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జాబ్‌మేళా ప్రారంభమైన రెండు గంటల్లోనే 600 మందికి పైగా యువత ప్రాథమికంగా ఎంపికైనట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ యువత చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రారంభంలో రూ.10 వేల నుండి రూ.20 వేల వేతనంతో ఉద్యోగంలో చేరినా, అనుభవం, నైపుణ్యాలు పెంచుకుంటే రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం పొందే అవకాశాలుంటాయని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి యువత అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో, టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 142కు పైగా కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ప్రాంతీయ పరిమితులు విధించుకోకుండా అవకాశాలు వచ్చిన చోట వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌మేళా మంచి అవకాశమని, దీని ద్వారా సుమారు 10 వేల నుంచి 12 వేల వరకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గత ఏడాది నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా 2,700 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు గుర్తుచేశారు. టాస్క్ ద్వారా జిల్లాలో నైపుణ్య శిక్షణను విస్తరించడంతో పాటు, సింగరేణి సంస్థ సహకారంతో శిక్షణ కేంద్రానికి విశాలమైన హాలు, ఏసీ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 142కు పైగా కంపెనీలు పాల్గొన్న ఈ జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగానే కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు అందజేశారు. జాబ్‌మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, టాస్క్ సీఈఓ ప్రదీప్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.