భక్తులకు అసౌకర్యం లేకుండా బుగులోని జాతర ఏర్పాట్లు

26-10-2026 | 11:11pm

నవంబర్‌ 23 నుంచి 27 వరకు జాతర నిర్వహణ

ఏర్పాట్లు వేగవంతం చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

భూపాలపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బుగులోని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అధికారులను ఆదేశించారు. సోమవారం భూపాలపల్లి ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

నవంబర్‌ 23 నుండి 27 వరకు జరిగే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కోనేరు బావి, శాశ్వత కల్యాణ మండపం, విద్యుత్‌ లైట్లు, పైప్‌లైన్‌, మెట్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, రూ.8.75 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాతరకు వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దాలన్నారు.

భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. రూ.4 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జాతరలో నిరంతర తాగునీరు, విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్యం, బ్లీచింగ్‌ పౌడర్‌ పిచికారీ వంటి పనులను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ఆర్టీసీ, పోలీస్‌, దేవాదాయ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్‌, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, దేవాలయ ఈఓ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు