మానసిక వైకల్యంతో ఉన్న మహిళపై అత్యాచారం

13-10-2026 | 06:31pm

నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

భూపాలపల్లి, అక్టోబర్‌ 13 (విజయక్రాంతి): మానసిక వైకల్యంతో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష(Prison sentence)తో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి జె జీవన్‌కుమార్‌ మంగళవారం తీర్పు వెలువరించారు.

కేసు పూర్వాపరాలు..

2021 నవంబర్‌ 28న టేకుమట్ల మండలం మండలవారిపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన బండి శంకర్‌ (55) అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి అక్కడికి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి టేకుమట్ల ఎస్‌ఐ కె రమణారెడ్డి కేసు నమోదు చేయగా సీఐ పి వెంకట్‌ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి, సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది ఎదులాపురం శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. న్యాయస్థాన పర్యవేక్షణ అధికారి బి రాజు, న్యాయస్థాన సమన్వయ అధికారి ఏఎస్‌ఐ జి వెంకన్న, కానిస్టేబుళ్లు జ్యోతి, శ్వేత, బాధితురాలికి న్యాయ సహకారం అందించిన జి రజిత తమవంతు సహకారం అందించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన దర్యాప్తు అధికారులు, ప్రస్తుత భూపాలపల్లి డీఎస్పి ఎ సంపత్‌రావు, చిట్యాల సీఐ సతీష్‌, ఎస్‌ఐ అమూల్యతో పాటు సంబంధిత పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు