సింగరేణి హామీలు ఏమైనట్టు
- మట్టి తరలింపు జోరు గ్రామాల అభివృద్ధి బేజారు
- హామీలు అమలు చేయండి.. గ్రామాలను ఆదుకోండి
- నిర్వాసిత గ్రామాల ప్రజల ఆవేదన
- త్వరలో నిర్వాసిత గ్రామాల సర్పంచులతో కమిటీ
గణపురం, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): ఓసి 3 ప్రారంభ సమయంలో సింగరేణి యాజమాన్యం(Singareni Management) పరిసర గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామాలను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది కాలుష్య కోరల్లో బాంబుల మోతల్లో చిక్కుకుంటున్న గ్రామాల శ్రేయస్సును మరిచిపోయింది. కేవలం కొన్ని గ్రామాల్లో పరిహరం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సింగరేణి ఓసీ–3 ప్రారంభ సమయంలో గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి యాజమాన్యం పలు హామీలు ఇచ్చింది ప్రస్తుతం వాటిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఓసీ–3 నుంచి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. తమ గ్రామాల నుంచి భారీగా మట్టి, ఖనిజ సంపద తరలిస్తున్నప్పటికీ స్థానిక గ్రామాల మౌలిక వసతులు, ప్రజల సమస్యల పరిష్కారంపై సింగరేణి యాజమాన్యం తగిన శ్రద్ధ చూపడం లేదని వారు ఆరోపించారు.
ఓసీ–3 ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను అమలు అమలు కావడంలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఓసి త్రీ వల్ల పరశురాంపల్లి గ్రామం తో పాటు పలు గ్రామాలు దుమ్ము దూళి బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. బాంబుల మోత వల్ల కొన్ని ఇళ్లకు పగుళ్లు రావడంతో పాటు భయం నీడన కాలం వెళ్లదీస్తున్నారు.
ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయా గ్రామాల ప్రజల శ్రేయస్సును మాత్రం సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాల సర్పంచులు వివిధ అవసరాల కోసం అధికారులను కలిసిన సమయంలో సరే అంటూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవసరాలు ఉన్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు.
సర్పంచ్ లను ను కూడా హేళన చేసే విధంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఓసి 3 గ్రామ పంచాయతీల పరిధిలోకి రాదని దాటవేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓసి ప్రారంభ సమయంలో సింగరేణి అధికారులు గ్రామాల వెంట తిరుగుతూ మొక్కలు నాటడం పాఠశాలల్లో అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికైనా సింగరేణి అధికారులు ఓసి త్రీ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామాలను దత్తత తీసుకొని వారి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
త్వరలో నిర్వాసిత గ్రామాల సర్పంచులతో కమిటీ
సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ త్వరలో గొల్లపల్లి, బస్వరాజు పల్లి, పరశురాంపల్లి, నగరంపల్లి, కొండాపూర్, గుర్రంపేట, వెంకటేశ్వర్ల పల్లి, తదితర గ్రామాల సర్పంచులతో కమిటీ ఏర్పాటు చేసుకొని సమస్యలపై సర్పంచులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
జనవరి నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం
సింగరేణి పరిసర గ్రామాల సర్పంచ్ లం జనవరి నెల నుండి గ్రామాల అభివృద్ధి విషయమై ఉన్నతాధికారులను కలవడం జరిగింది. కలిసిన సమయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఒక అధికారిని కలిస్తే మరొక అధికారిని కలవాలని సూచిస్తున్నారు. అధికారులను పలుమార్లు కలిసిన సందర్భంగా ఎమ్మెల్యేను కలవాలని అధికారులే చెబుతున్నారు.
అధికారులు స్పందించకపోవడం వల్ల తమకు ఓట్లు వేసిన ప్రజలకు ఏం చేయలేక ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. త్వరలోనే నిర్వాసిత గ్రామాల సర్పంచులు అందరం కలిసి కమిటీ వేసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష ఎన్నిక అనంతరం యాజమాన్యంపై యుద్ధం ప్రకటిస్తాం
ఉడుత సాంబయ్య యాదవ్ పరశురాం పల్లి సర్పంచ్