చంటి బిడ్డతో ప్రజావాణికి...
విధి నిర్వహణకు కస్తూరి అంకితభావం...
హనుమాజీపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కస్తూరి తీరుపై ప్రశంసలు...
బాన్సువాడ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హనుమాజీపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కస్తూరి(ICDS Project Officer Kasturi) విధి నిర్వహణ పట్ల అంకితభావం, బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి చంటి బిడ్డను వెంట తీసుకుని ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తన విధులను నిర్వర్తించడం పలువురిని ఆకట్టుకుంది.ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆమె చంటి బిడ్డతో హాజరయ్యారు. కుటుంబ బాధ్యతలతో పాటు ప్రభుత్వ విధులను సమన్వయం చేసుకుంటూ ప్రజావాణిలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది.
ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో తన ఆచరణ ద్వారా చాటిచెప్పారని పలువురు పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరుకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.ప్రజావాణి వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ హాజరైన కస్తూరిని పలువురు అభినందించారు.