ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి

05-10-2026 | 05:47pm
  1. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి
  2. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు, దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
  3. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి
  4. హెల్ప్‌డెస్క్‌ల వద్ద ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన సహకారం అందించాలి
  5. సుల్తానాబాద్ లో ఎస్‌ఐఆర్‌ హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన ఎలక్టోరల్ రోల్‌ అబ్జర్వర్, జిల్లా కలెక్టర్ 

సుల్తానాబాద్, అక్టోబర్ 05 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్‌డెస్క్‌ల ద్వారా అవసరమైన సమాచారం, సహకారం అందించాలని ఎలక్టోరల్ రోల్‌ అబ్జర్వర్ బాల మాయ దేవి సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) హెల్ప్‌డెస్క్‌ను ఎన్నికల రోల్‌ అబ్జర్వర్ బాల మాయ దేవి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) పరిశీలించారు.

ఈ సందర్భంగా హెల్ప్‌డెస్క్‌లో ఓటర్లకు అందిస్తున్న సేవలు, స్వీకరిస్తున్న దరఖాస్తులు, నోటీసుల పరిశీలన, అవసరమైన పత్రాల వివరాలను వారు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాల మాయ దేవి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. హెల్ప్‌డెస్క్‌ల వద్దకు వచ్చే ఓటర్లకు దరఖాస్తుల విధానం, అవసరమైన పత్రాలు, నోటీసులకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. ఓటర్ల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

హెల్ప్‌డెస్క్‌ల వద్ద ప్రజలకు స్పష్టమైన సమాచారం

హెల్ప్‌డెస్క్‌ల వద్ద ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ, అవసరమైన పత్రాలు, దరఖాస్తుల స్థితిగతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హెల్ప్‌డెస్క్‌కు వచ్చే ప్రతి ఓటరుకు సిబ్బంది సహకారం అందించి, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తూ, ఓటర్ల హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ  అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, నిబంధనలకు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ వెళ్లి నోటీసుల పరిశీలన, సంబంధిత పత్రాల స్వీకరణ, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించిపరిష్కరించాలని, ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. నోటీసులు జారీ చేసిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన పత్రాలను సేకరించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసుల పరిశీలన పూర్తి చేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసులపై బీఎల్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లను కార్యాలయాలకు పిలిపించకుండా సాధ్యమైనంత వరకు వారి ఇళ్ల వద్దనే వివరాలను పరిశీలించి, అవసరమైన పత్రాలను సేకరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న నోటీసుల పరిష్కారంపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీఓ బి. గంగయ్య, సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరుద్దీన్, సంబంధిత ఎన్నికల అధికారులు, బీఎల్‌ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు