ఐసీడీఎస్ ‘ఆయా’ ఇంటర్వ్యూలపై సందేహాలు!
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన ప్రక్రియ.. మొరంపల్లి బంజరలో నిర్వహణ
వేదిక మార్పుపై స్పష్టత కరవు.. అభ్యర్థుల్లో అయోమయం
బూర్గంపాడు, (విజయక్రాంతి): ఐసీడీఎస్ బూర్గంపాడు ప్రాజెక్టు పరిధిలోని ‘ఆయా’ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన అభ్యర్థుల ఇంటర్వ్యూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించగా.. బూర్గంపాడు మండలానికి సంబంధించిన ఇంటర్వ్యూలను మాత్రం మొరంపల్లి బంజర పంచాయతీ కార్యాలయం(Morampalli Banjara Panchayat office)లో నిర్వహించడం ప్రశ్నలకు తావిస్తోంది.
వేదిక మార్పు ఎందుకు?
‘ఆయా’ పోస్టుల ఇంటర్వ్యూలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికగా ఉండగా.. బూర్గంపాడు ప్రాజెక్టు పరిధి అభ్యర్థుల ప్రక్రియను మొరంపల్లి బంజరకు మార్చడానికి కారణాలేమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది. వేదిక మార్పునకు సంబంధించి ముందస్తుగా అభ్యర్థులకు సమాచారం ఇచ్చారా? ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారా? అనే అంశాలపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.
నిబంధనల ప్రకారమేనా?
నియామక ప్రక్రియలో అర్హతలు, ఎంపిక విధానం, ఇంటర్వ్యూ నిర్వహణ, జిల్లా కమిటీ సమక్షం ఎంపికలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా వేదిక మార్పు, పూర్తిస్థాయి జిల్లా కమిటీ గైరహాజర్ వంటి అంశాలకు సంబంధించి అధికారిక ఆదేశాలు, అనుమతులు ఉంటే వాటిని వెల్లడించడం ద్వారా అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలకు తెరపడే అవకాశం ఉంది.
అభ్యర్థుల్లో అయోమయం
జిల్లాలోని ఇతర మండలాల అభ్యర్థులకు ఒకే వేదికగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి.. బూర్గంపాడు మండలానికి మాత్రం భిన్నమైన వేదికను ఎంపిక చేయడంపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియ ఏ నిబంధనల ప్రకారం నిర్వహించారన్నది అధికారులు స్పష్టం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఉన్నతాధికారులు పరిశీలించాలి
ఇంటర్వ్యూల వేదిక మార్పు, పూర్తిస్థాయి జిల్లా కమిటీ లేకపోవడం, సంబంధిత అనుమతులు, ఎంపిక విధానం, అభ్యర్థుల హాజరు తదితర వివరాలను ఐసీడీఎస్ ఉన్నతాధికారులు అధికారులు బహిరంగంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలించి వేదిక మార్పునకు గల కారణాలను స్పష్టం చేస్తే అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలు నివృత్తి అవుతాయని పేర్కొంటున్నారు.