నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర
భిక్కనూర్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర(District SP M. Rajesh Chandra) ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని కేసు ఫైళ్లు, రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను చట్టప్రకారం త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. రాత్రి గస్తీని పటిష్టం చేయడంతో పాటు గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో జాప్యం చేయకుండా సాక్ష్యాధారాలు సేకరించి, నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. నరేష్, భిక్కనూర్ ఎస్హెచ్ఓ అనిల్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.