మంత్రి సీతక్క తీరుపై స్థానికుడి విమర్శలు
కాలువ పనులు పూర్తి కాకుండానే శిలాఫలకం ఆవిష్కరణ
వెంకటాపూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న సైడ్ డ్రెయిన్ పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవం చేయడంపై స్థానికుడు కుక్క అశోక్ విమర్శలు చేశారు. గత మే నెలలో సుమారు వంద మీటర్ల పొడవున కాలువ నిర్మాణం చేపట్టినప్పటికీ, దానికి ఇరువైపులా మట్టి నింపకుండా వదిలేశారని తెలిపారు. కాలువ తవ్వకం కోసం జేసీబీతో తీసిన మట్టిని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారని, అప్పటి నుంచి కాలువకు ఇరువైపులా మట్టి నింపే పనులు చేపట్టలేదని పేర్కొన్నారు.
ఈ సమస్యను పలుమార్లు కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత ఏఈ, డీఈ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పర్యటనలో భాగంగా గురువారం మంత్రి సీతక్క కాలువ పనులు పూర్తయినట్లుగా భావించి శిలాఫలకాన్ని ప్రారంభించడం విడ్డూరంగా ఉందని అశోక్ విమర్శించారు.
లక్షలాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన పనులు పూర్తయ్యాయా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అసంపూర్తి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువకు ఇరువైపులా మట్టి నింపి, మిగిలిన పనులను పూర్తి చేయాలని కోరారు.