యాదగిరిగుట్ట దేవస్థానంలో రెండు అభివృద్ధి పనులకు భూమిపూజ

29-10-2026 | 08:19pm

యాదగిరిగుట్ట, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతున్న శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి(Lord Sri Yadagiri Lakshmi Narasimha Swamy) దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో రెండు అభివృద్ధి పనులకు శుక్రవారం భూమిపూజ(Groundbreaking Ceremony) నిర్వహించనున్నారు. 

యాదగిరిగుట్ట దేవస్థాన చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి తన స్వంత నిధులతో చేపట్టనున్న ఈ పనుల్లో భాగంగా, ఆలయ ఉత్తర భాగంలో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మండపం (రంగ మండపం) నిర్మాణానికి ఉదయం 11:14 గంటలకు, రాయగిరి గ్రామం వద్ద స్వాగత తోరణం (ఆర్చ్ గేట్) నిర్మాణానికి మధ్యాహ్నం 12:25 గంటలకు పండితులు  నిర్ణయించిన సుముహూర్తాల్లో భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె. భవాని శంకర్  పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై శాఖాధిపతులు మరియు అర్చక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు జారీ చేశారు. భూమిపూజ కార్యక్రమాలు సజావుగా జరిగేలా, భక్తులకు దర్శన సంబంధిత ఇబ్బందులు తలెత్తకుండా, ఆలయ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

దేవస్థాన అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఈ నిర్మాణ పనులు దోహదపడనున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు