ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఫిర్యాదు
జుక్కల్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): జుక్కల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం మూడు ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో శ్రీనివాస్(MPDO Srinivas) తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారు.
డోన్గాం గ్రామానికి చెందిన మహానంద తన పదవ తరగతి (ఎస్ ఎస్ సి) మెమో ఎక్కడో పోగొట్టుకున్నట్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డూప్లికేట్ ఎస్ ఎస్ సి (పదవ తరగతి) మెమో పొందేందుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలని స్థానిక జుక్కల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినప్పటికీ తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆమె తెలిపారు.
భవిష్యత్తులో ఉన్నత చదువులు, ఉద్యోగాలు తదితర అవసరాలకు పదవ తరగతి మెమో కీలకమైనందున, తనకు న్యాయం జరిగేలా సంబంధిత పోలీసు అధికారులకు సూచించాలని ఆమె అధికారులను కోరారు. ఈ విషయమై పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కనీసం దరఖాస్తును కూడా స్వీకరించలేదని మహానంద ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఖండేబల్లూర్ గ్రామానికి చెందిన పండరి, అటవీ భూములకు పట్టాలు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
అర్హత కలిగిన వారికి నిబంధనల ప్రకారం భూమి హక్కులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జుక్కల్‌కు చెందిన శివాజీ తన పొలాలకు వెళ్లేందుకు ఉపయోగించే పానాది మార్గాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పానాది మార్గాన్ని పరిశీలించి పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజల నుంచి వచ్చిన మూడు ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.