వినాయకుని నామాల్లో దాగిన ఆధ్యాత్మిక రహస్యం

13-09-2026 | 01:41pm

ఒక్కో నామం వెనుక ఒక్కో తత్వం

గణపతి రూపంలో యోగం, జ్ఞానం, శక్తి

దోమకొండ సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటా గణపతి నామస్మరణ మార్మోగుతుంది. అయితే మనం పలికే వాతాపి గణపతి, ఉచ్చిష్ట గణపతి, మహాగణపతి, లక్ష్మీ గణపతి, నాట్య గణపతి, హేరంబ గణపతి వంటి నామాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటే గణపతి ఆరాధనకు మరింత లోతైన అర్థం కనిపిస్తుంది.

వినాయకుడు కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు. యోగం, ప్రాణశక్తి, అక్షరజ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం, పరమాత్మ తత్వానికి ప్రతీకగా గణపతి రూపాన్ని దర్శించవచ్చు అని లెక్చరర్ ఉమాశేషారావు వైద్య వివరిస్తున్నారు.

వాతాపి గణపతి.. ప్రాణశక్తికి ప్రతీక

‘వాతాపి’ అంటే గాలిని పానం చేయడం అనే భావం వస్తుంది. యోగసాధనలో ప్రాణాయామం ద్వారా వాయువును నియంత్రించడం అత్యంత ముఖ్యమైన అంశం. గణపతి మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవతగా భావించబడతాడు. కుండలినీ శక్తి జాగరణ కూడా మూలాధారం నుంచే ప్రారంభమవుతుందని యోగశాస్త్రం చెబుతుంది. ప్రాణవాయువును నియంత్రిస్తూ ఆ శక్తిని ఊర్ధ్వదిశగా నడిపించే చైతన్యానికి ప్రతీకగా ‘వాతాపి గణపతి’ అనే నామాన్ని అర్థం చేసుకోవచ్చని ఉమాశేషారావు వైద్య వివరిస్తున్నారు.

ఉచ్చిష్ట గణపతి.. అక్షరాలకు అధిపతి

మన మాటకు మూలం అక్షరం. అక్షరాలకు మూల స్వరూపంగా ఓంకారాన్ని భావిస్తారు. గణపతి ఓంకార స్వరూపుడిగా ఆరాధించబడతాడు. అక్షరాలు మన నోటి నుంచి వెలువడతాయి. నోటి నుంచి వెలువడినదే ‘ఉచ్చిష్టం’ అనే భావనతో అక్షరపతిగా ఉన్న గణపతిని ‘ఉచ్చిష్ట గణపతి’ అని వ్యవహరిస్తారని ఆధ్యాత్మిక వివరణ. అంటే మన మాట, మన అక్షరం, మన జ్ఞానం అన్నింటికీ మూలమైన శక్తిని గణపతి తత్వంలో దర్శించవచ్చు.

మహాగణపతి.. సర్వదేవతల సమ్మేళనం

‘మహా’ అనే పదం పరబ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది. గణపతి సర్వదేవతాత్మకుడనే భావనకు మహాగణపతి రూపం ప్రతీకగా నిలుస్తుంది. మహాగణపతి రూపంలో అనేక చేతులు, ఆయుధాలు, వస్తువులు కనిపిస్తాయి. అవి కేవలం అలంకారాలు కావు.. వివిధ దేవతా తత్వాలకు సంకేతాలుగా భావించవచ్చు. ఒక చేతిలో చక్రం, పద్మం విష్ణు–లక్ష్మీ తత్వాలను సూచిస్తే, త్రిశూలం, పాశం శివ–పార్వతీ తత్వాలకు ప్రతీకలుగా భావిస్తారు.అలాగే చెరుకువిల్లు, నల్లకలువ మన్మథ–రతీ తత్వాలను, వరికంకి, గద భూదేవి–వరాహస్వామి తత్వాలను సూచిస్తాయని ఆధ్యాత్మిక వివరణ. బీజాపూరం (దానిమ్మ పండు) పుష్టి తత్వానికి, ఏకదంతం పుష్టిపతి తత్వానికి సంకేతంగా భావిస్తారు. తొండంలో ఉన్న రత్నఖచిత కలశం మోక్షానికి ప్రతీకగా దర్శించబడుతుంది.అందుకే మహాగణపతి రూపంలో అనేక దేవతా తత్వాల సమన్వయం కనిపిస్తుంది.

లక్ష్మీ గణపతి.. ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం

లక్ష్మీ అంటే కేవలం విష్ణుపత్ని అనే అర్థంలోనే చూడాల్సిన అవసరం లేదని ఉమాశేషారావు వైద్య వివరిస్తున్నారు. ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం.గాయకుడికి చక్కగా పాడగలగడం ఒక శక్తి. ఆ శక్తే అతనికి లక్ష్మీ. కళాకారుడికి కళే ఐశ్వర్యం. విద్యార్థికి విద్యే సంపద.అలా మనలో ఉన్న సామర్థ్యాన్ని, శక్తిని వెలికితీసే తత్వమే లక్ష్మీ గణపతిగా భావించవచ్చు.నాట్య గణపతి.. ఆనందానికి ప్రతిరూపం మనసులో ఆనందం ఉప్పొంగినప్పుడు సహజంగానే నాట్యం చేయాలనిపిస్తుంది.

అందుకే ఆనందంతో నిండిన గణపతిని నాట్య గణపతిగా, తాండవ గణపతిగా కూడా భావిస్తారు. ప్రపంచంలోని కాలగమనం ఒక లయ. మన శ్వాస కూడా ఒక లయ. గుండె కొట్టుకోవడం కూడా ఒక లయ. అలా లయబద్ధంగా నిరంతరం గమనం చేసే చైతన్యమే నాట్య గణపతి అనే ఆధ్యాత్మిక భావన కనిపిస్తుంది.

హేరంబ గణపతి.. శుభనాదానికి ప్రతీక

హేరంబ గణపతి నామంలో కూడా ప్రత్యేకమైన తాత్విక అర్థం ఉందని చెబుతారు.శుభమైన శబ్ద స్వరూపం, ఓంకార స్వరూపం అనే భావనతో హేరంబ గణపతిని దర్శించవచ్చు. దీనితో పాటు దీనులను పాలించి రక్షించే తత్వానికి కూడా ఈ నామాన్ని అన్వయిస్తారు. వినాయకుడు.. నాయకుడు లేనివాడు.. ‘వినాయకుడు’ అనే పదానికే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది.

‘విగత నాయకుడు’ – తనకంటే పైగా మరొక నాయకుడు లేనివాడు

అదే సమయంలో వినయాన్ని ప్రసాదించేవాడు అనే భావనతో కూడా ‘వినాయకుడు’ అనే నామాన్ని అర్థం చేసుకోవచ్చు. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరగాలి. ఆ వినయాన్ని ప్రసాదించే తత్వమే వినాయక తత్వం. మూషిక వాహనం.. మనలోని జీవాత్మకు ప్రతీక గణపతి వాహనం మూషికం. సాధారణంగా ఎలుకను చిన్న జీవిగా మాత్రమే చూస్తాం. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో మూషిక వాహనానికి మరో లోతైన అర్థాన్ని చెబుతారు.మనిషి గుండె అనే గుహలో జీవాత్మ నివసిస్తూ ప్రపంచంలోని అనేక విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ జీవాత్మను అధిష్ఠించిన పరమాత్మకు ప్రతీకగా మూషిక వాహనుడైన గణపతిని దర్శించవచ్చు. మరో భావనలో నోరు అనే ‘కలుగులో’ తిరిగే నాలుకను ఎలుకతో పోల్చవచ్చు. ఆ నాలుకను అధిష్ఠించి అక్షరాలను పలికించే శక్తి గణపతి. అందుకే ఆయనను అక్షరపతి, మూషికవాహనుడుగా భావించవచ్చు.

‘గణపతి’ అనే పేరులోనే విశ్వతత్వం

‘గణం’ అంటే సమూహం. మనిషిలో ఇంద్రియాలు ఒక గణం. పంచప్రాణాలు మరో గణం. మన చుట్టూ ఉన్న అనేక జీవరాశులు, శక్తులు, ప్రకృతి తత్వాలు కూడా గణాలుగానే చూడవచ్చు.ఈ గణాలన్నింటికీ అధిపతి – గణపతి.అందుకే గణపతి రూపాన్ని కేవలం ఒక దేవతా రూపంగా కాకుండా మనిషిలోని శక్తి, ప్రకృతిలోని చైతన్యం, విశ్వంలోని సమన్వయానికి ప్రతీకగా దర్శించినప్పుడు వినాయక ఆరాధనకు మరింత విశాలమైన అర్థం లభిస్తుంది.వినాయక నామం పలకడం ఒక భక్తి.. ఆ నామం వెనుక ఉన్న తత్వాన్ని తెలుసుకోవడం ఒక జ్ఞానం.

మరిన్ని వార్తలు