మైనర్ల రక్షణకు పోక్సో చట్టం.. ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం!

26-10-2026 | 08:29pm

మంచి స్పర్శ.. చెడు స్పర్శపై విద్యార్థులకు న్యాయ అవగాహన 

రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కే వీణ ప్రణతి

హుజురాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో అవగాహనే ప్రధాన రక్షణ కవచమని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. వీణప్రణతి(Judge Veena Pranathi) అన్నారు. బాలలు తమ హక్కులు, రక్షణ కోసం ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాలను వివరిస్తూ, అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, ఇలాంటి ఘటనలను దాచిపెట్టకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గీతా షాజు, డైరెక్టర్ షాజు థామస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు