నీటి గండం తప్పేనా?
- ప్రాజెక్టుల్లో అంతంతే నీటి నిల్వలు
- వచ్చే వేసవి నాటికి సరిపోవడం గగనమే
- పొదుపు పాటించాలని సర్కారు సూచన
కరీంనగర్, అక్టోబరు 30 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని ప్రధాన సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో అక్టోబర్ చివరి నాటికి నీటి నిల్వలు సంతృప్తికరంగా లేవు. లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.07 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 15.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 18.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగరాలు, గ్రామాలకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎల్లంపల్లి, ఎల్ఎండి ద్వారా ప్రస్తుతమున్న నీరు సాగు నీటికి ఇవ్వకుండా కేవలం తాగునీటికి ఉపయోగించినా వేసవి కాలం ముగిసే వరకు అనగా జూన్ 2027 వరకు సరిపోవడం కష్టమే.
ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు చివరి దశకు రాగా ఈ సీజన్ గట్టెక్కడానికి సరిపోలేదు. తెలంగాణ ప్ర భుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 మండలాలను ప్రకటించింది. ఈ మండలాలతో పాటు లో తట్టు ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటడం వల్ల, రా బోయే యాసంగి సీజన్ పంటలకు నీటి కొరత ఏర్పడే అవకా శం ఉంది. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ఆ రుతడి పంటలు ఎంచుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
తాగునీరు, విద్యుత్తు పొదుపుగా వాడాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా
ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి లభ్యత, విద్యుత్తు వినియోగం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీటిని అవసరమైన మేరకే వినియోగించేలా, విద్యుత్తును పొదుపుగా వాడుకోవడంపై గ్రామగ్రామాన విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించాం. ప్రతి గ్రామంలో భూగర్భజలాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా అవసరాలకు అనుగుణంగా వినియోగించాలి.