డిపాజిట్ల పేరుతో దగా.. రూ.28 కోట్లు స్వాహా!
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): యూనిక్ మెర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్వయం మల్టీస్టేట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థలకు సంబంధించిన పెట్టుబడుల మోసం ఆరోపణలపై కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు.
ప్రాథమిక విచారణ ప్రకారం, ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కైలాష్ రాయ్ వివిధ పెట్టుబడి పథకాలను (Investment Schemes) ప్రవేశపెట్టి ప్రజల నుంచి డిపాజిట్లు (Deposits) సేకరించాడు. నెలవారీ పెట్టుబడి పథకాలు, స్థిర డిపాజిట్లు, స్థిరాస్తి పథకాలు, హోటల్ విహార ప్యాకేజీల పేరుతో ప్రజలను ఆకర్షించి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించాడు.
2019లో పలు పథకాల గడువు ముగిసినప్పటికీ పెట్టుబడిదారులకు సొమ్ము తిరిగి చెల్లించలేదు. కరోనా కారణంగా నష్టాలు వచ్చాయని చెబుతూ 2020లో సంస్థ కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ కేసులో కరీంనగర్ జిల్లాలోని బాధితులకు సుమారు రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు నష్టం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ కైలాష్ రాయ్‌ను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో ఉన్నాడు.పట్టుబడిన ఐదుగురు నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన గుడిపాటి గాంధీ, కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప, నిజామాబాద్‌కు చెందిన కొమిరె భూమా గౌడ్, పెద్దపల్లికి చెందిన యేదెళ్ల రమేష్ ఉన్నారు.
ఈ కేసులో ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా కరీంనగర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.