బాధ్యులెవరు..?
రికవరీ వివరాలు ఇవ్వాల్సిందే
డీజిల్ బిల్లులపై విజిలెన్స్ విచారణ..
కరీంనగర్ క్రైం, నవంబర్ 26 (విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో(Karimnagar Municipal Corporation) డీజిల్ వినియోగం, ఇంధన బిల్లుల రీయింబర్స్మెంట్ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దృష్టి సారించింది. కార్పొరేషన్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు, మోసపూరితంగా ఇంధన బిల్లుల రీయింబర్స్మెంట్, అనుమానాస్పద డీజిల్ వినియోగం జరుగుతున్నాయంటూ అందిన ఫిర్యాదుపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కీలక రికార్డులు, సమాచారాన్ని అందజేయాలని కోరుతూ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌కు విజిలెన్స్ శాఖ మరోసారి రిమైండర్ జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) శాఖ పరిధిలోని కరీంనగర్ ప్రాంతీయ విజిలెన్స్ అధికారి, అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి. బస్వారెడ్డి నవంబర్ 23న మున్సిపల్ కమిషనర్‌కు రిమైండర్ పంపించారు. గతంలో అక్టోబర్ 14న ఇదే అంశంపై సమాచారం కోరుతూ లేఖ పంపినప్పటికీ, తాజాగా రిమైండర్-1 జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆడిట్ నివేదికను పూర్తి వివరాలతో అందించాలని విజిలెన్స్ శాఖ లేఖలో కోరింది. ఆడిట్ నివేదికలో పేర్కొన్న అభ్యంతరాలు, గుర్తించిన లోపాలపై కార్పొరేషన్ ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఎటిఆర్)ను సమర్పించాలని ఆదేశించింది.
దీంతో డీజిల్ బిల్లుల వ్యవహారంలో ఆడిట్ పరిశీలనలు విచారణలో కీలకంగా మారనున్నాయి. ఆడిట్ నివేదికలో గుర్తించిన లోపాలు, ఆర్థిక అవకతవకలకు బాధ్యులైన అధికారులు, సిబ్బంది పేర్లు, వారి హోదాలు, సంబంధిత కాలంలో వారు నిర్వహించిన విధులు, బాధ్యతల వివరాలను అందించాలని విజిలెన్స్ కోరింది. అంతేకాకుండా బాధ్యులుగా గుర్తించిన వారిపై ఏవైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టారా, శిక్షలు విధించారా, వాటికి సంబంధించిన ఉత్తర్వులు, రికార్డులను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.
ఆర్థిక అవకతవకల కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లయితే, ఆ మొత్తాన్ని ఎవరెవరి నుంచి ఎంత మేరకు రికవరీ చేశారు.. ఇంకా రికవరీ చేయాల్సిన మొత్తం ఎంత.. రికవరీ ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను ఆధారాలతో సహా అందించాలని కోరడం మరో కీలక అంశం. 1997 నవంబర్ 25న జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నెంబర్ 504ను ప్రస్తావిస్తూ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు అవసరమైన సమాచారం, రికార్డులను అందించి సహకరించాల్సిన బాధ్యత ఉందని, అవసరమైన ధ్రువీకరించిన పత్రాలను వీలైనంత త్వరగా తమ కార్యాలయానికి అందించాలని కమిషనర్‌ను కోరారు.
అయితే రిమైండర్ లేఖలో అవకతవకలు నిర్ధారణ అయినట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోందని, అందులో భాగంగా కీలకమైన ఆడిట్ నివేదిక, అధికారుల బాధ్యతలు, చర్యలు, రికవరీ వివరాలను విజిలెన్స్ కోరినట్లు తెలుస్తుంది. కార్పొరేషన్ నుంచి అందే రికార్డుల ఆధారంగా విచారణలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.