మద్యం మహమ్మారి చిచ్చు
మానకొండూరు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): మద్యం మహమ్మారి (Alcohol Addiction) ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నిత్యం మద్యం సేవించి భార్య, కుటుంబ సభ్యులతో గొడవపడుతూ వేధింపులకు పాల్పడుతున్న భర్తను.. సహనం కోల్పోయిన భార్య ఇటుకతో తలపై బలంగా కొట్టడంతో మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన టప్ప రమేష్ (44), సుమలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రమేష్ మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతూ వేధించేవాడని సమాచారం. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో సుమలత ఇటుకతో రమేష్ తలపై బలంగా కొట్టినట్లు తెలుస్తోంది. కుమారుడు సైతం కర్రతో తండ్రిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో రమేష్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు (Case Registered) చేసి దర్యాప్తు (Investigation) చేపట్టారు. కాగా, మృతుడి భార్య సుమలత, కుమారుడు మానకొండూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.