స్నేహ గ్రూప్‌పై ఐటీ పంజా.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం

23-11-2026 | 11:38am

హైదరాబాద్: ప్రముఖ పౌల్ట్రీ సంస్థ స్నేహ గ్రూప్‌(Poultry Company Sneha Group)పై ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) తనిఖీలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో అధికారులు సుమారు రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న స్నేహ ఫార్మ్స్ ప్రధాన కార్యాలయం(Sneha Farms Head Office)లో భారీగా నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, బ్రాంచీలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

ఈ సోదాల్లో ప్రధానంగా చికెన్, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ విక్రయాల ద్వారా జరిగే నగదు లావాదేవీలపై అధికారులు దృష్టి సారించారు. వ్యాపార ఆదాయాన్ని పూర్తిస్థాయిలో లెక్కల్లో చూపించారా? ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా వ్యత్యాసాలున్నాయా? అనే కోణంలో పత్రాలు, కంప్యూటర్ రికార్డులను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సేకరించిన పత్రాలు, డిజిటల్ సమాచారాన్ని అధికారులు విశ్లేషిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు