బాంబులు పేలుతాయ్.. పోలీసులకు ఉగ్ర హెచ్చరిక!

22-11-2026 | 06:48pm

హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలో బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ పోలీసులకు అందిన ఓ బెదిరింపు ఈమెయిల్(Threatening Email) తీవ్ర ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా 26/11 ముంబై ఉగ్రదాడుల తరహాలో దాడులు చేస్తామంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడం కలకలం సృష్టించింది. నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొనడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారు? నిజంగానే ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? లేక ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో లష్కర్-ఎ-తైబా కమాండర్‌గా పేర్కొంటున్న లతీఫ్ భట్ హతమైన ఘటనకు ప్రతీకారంగా దాడులు చేస్తామని ఈమెయిల్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తొంది.

ఈ నేపథ్యంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? నిజంగా ఏదైనా ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈమెయిల్ పంపిన వ్యక్తుల గుర్తింపు, సందేశం విశ్వసనీయతను నిర్ధారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద వస్తువులు లేదా పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఒక బెదిరింపు ఈమెయిల్ హైదరాబాద్‌లో భద్రతాపరమైన అప్రమత్తతకు కారణమైంది. ఈ హెచ్చరిక వెనుక అసలు నిజం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు