కాల్పుల ఘటన తర్వాత తొలిసారి..
కాల్పుల ఘటన తర్వాత టైగర్ ష్రాఫ్ గ్రాండ్ రీఎంట్రీ..
స్టేజ్‌పై మాస్ డ్యాన్స్!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) మళ్లీ తన స్టైల్లో అదరగొట్టాడు. ఇటీవల తన కారుపై జరిగిన కాల్పుల ఘటనతో వార్తల్లో నిలిచిన ఆయన.. తాజాగా తొలిసారి బహిరంగ కార్యక్రమంలో కనిపించాడు. ముంబైలో నిర్వహించిన 'గ్లోబల్ పీస్ హానర్స్(Global Peace Honours 2026)' వేడుకలో స్టేజ్‌పైకి వచ్చి 'దేవా శ్రీ గణేశా' పాటకు అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.
సంప్రదాయ లుక్‌లో టైగర్.. స్టేజ్‌పై అదరగొట్టాడు!
ఈ వేడుకలో టైగర్ ప్రత్యేకమైన దుస్తుల్లో మెరిశాడు. ఎరుపు రంగు ధోతీ తరహా ప్యాంట్, మెటాలిక్ ఆర్మ్ కఫ్స్, ఆకర్షణీయమైన ఆభరణాలతో సంప్రదాయ, మోడ్రన్ లుక్‌ను కలిపి కనిపించాడు. 'దేవా శ్రీ గణేశా' పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ ప్రేక్షకులను అలరించాడు.
ప్రదర్శన అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన టైగర్.. మరోసారి స్టేజ్‌పైకి రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం కల్పించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అమృతా ఫడ్నవీస్లకు కృతజ్ఞతలు తెలిపాడు.
అసలేం జరిగింది?
అక్టోబర్ 18న ముంబైలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి ఆయన తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఆయన కారు అద్దం దెబ్బతినగా, ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్.. సినిమాలతో బిజీ!
ఇటీవల టైగర్ తన సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా తిరిగి ప్రారంభించాడు. 'తేను లేకే జానా' పాట టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఆయన సోదరి కృష్ణా ష్రాఫ్ 'హి ఈజ్ బ్యాక్' అంటూ స్పందించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. టైగర్ ప్రస్తుతం రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లగ్ జా గలే' చిత్రంలో నటిస్తున్నాడు.
కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, లక్ష్య లాల్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2027 మే 14న విడుదల కానుంది. మరోవైపు దర్శకుడు రెమో డిసౌజాతో కలిసి ఓ కొత్త ప్రాజెక్టులోనూ టైగర్ నటిస్తున్నాడు. కాల్పుల ఘటన తర్వాత మళ్లీ స్టేజ్‌పైకి వచ్చి తన డ్యాన్స్‌తో అలరించిన టైగర్‌ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.