విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు
కరీంనగర్, సెప్టెంబరు 6 (విజయక్రాంతి): గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక తనిఖీలు, విద్యుత్ ప్రమాదాల(Electrical hazards) నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ ఎస్ఈ వి. గంగాధర్(Electricity SE V. Gangadhar) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు(Electrical accidents) చోటుచేసుకోకుండా ప్రజలు, భక్తులు, మండప నిర్వాహకులు, విద్యుత్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పండుగ(Ganesh Chaturthi) వేడుకల్లో ఆనందం ఎంత ముఖ్యమో, ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత అంతకంటే ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నందున విద్యుత్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. విగ్రహాల ఎత్తు, ట్రక్కులు, క్రేన్ల ఎత్తును దృష్టిలో ఉంచుకుని నిమజ్జన మార్గాలను విద్యుత్ సిబ్బంది ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. విద్యుత్ లైన్లకు దగ్గరగా గణేష్ విగ్రహాలు(Ganesh idols), క్రేన్లు, మెటల్ ఫ్రేములు లేదా ఇతర అలంకరణ సామగ్రిని తీసుకెళ్లడం ప్రమాదకరమని, జాగ్రత్తగా, దూరంగా తీసుకువెళ్లాలని కోరుతున్నారు.
గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని చెప్పారు. విద్యుత్ భద్రతా నియమాలు పాటిస్తూ, టీజీఎన్పీడీసీఎల్ కు సహకరించి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా, ముఖ్యంగా ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు లేకుండా సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్ఈ కోరారు.






