కరీంనగర్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి
కరీంనగర్ సిటీ.(విజయక్రాంతి): మూడు మండలాలకే కరువు పరిమితం చేయడం అన్యాయం. ఎల్ నినో ప్రభావంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒకవైపు చెబుతూనే, మరోవైపు కరువు పరిస్థితులను అధికారికంగా గుర్తించి రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఈరోజు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
పంటలు ఎండిపోయి, పెట్టుబడులు చేతికందక రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదని వారు అన్నారు. కరీంనగర్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని రైతులు కోరుతుంటే, ప్రభుత్వం కేవలం కరీంనగర్ పట్టణం, కరీంనగర్ రూరల్, హుజురాబాద్ ప్రాంతాలను మాత్రమే కరువు మండలాల జాబితాలో చేర్చడంతో మిగిలిన మండలాల రైతాంగానికి తీవ్ర అన్యాయం చేయడమేనని.
మిగతా ప్రాంతాల్లోని రైతుల కష్టాలను పట్టించుకోకుండా కేవలం మూడు మండలాలకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, సాగునీటి ఇబ్బందులు, పంటల ఎండిపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని. వ్యవసాయం కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికి రాక ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కరువు మండలాల ఎంపికలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటల నష్టం, వర్షపాతం, సాగునీటి లభ్యత, రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను సమగ్రంగా పరిశీలించి న్యాయంగా నిర్ణయం తీసుకోవాలని కేవలం కొన్ని ప్రాంతాలను మాత్రమే గుర్తించి, మిగతా ప్రాంతాల రైతులను సహాయానికి దూరం చేయడం తగదని వారు అన్నారు.
కరీంనగర్ జిల్లాలోని కరువు పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి జిల్లా మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలి. కేవలం మూడు మండలాలకే పరిమితం కాకుండా, జిల్లాలోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలి. పంట నష్టపోయిన రైతులను గుర్తించి అర్హులైన ప్రతి రైతుకూ న్యాయమైన పరిహారం అందించాలి. వ్యవసాయ రుణాలు, పంటల సాగు ఖర్చులు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలి. కరువు పరిస్థితులపై పారదర్శకంగా వ్యవహరించి, రైతులకు అందాల్సిన ప్రభుత్వ సహాయాన్ని ఎలాంటి వివక్ష లేకుండా అందించాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. కరీంనగర్ జిల్లాలోని రైతులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి, కరువు పరిస్థితులపై పునఃసమీక్ష చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తోందని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
రైతుల కష్టాలను విస్మరిస్తే తెలంగాణ రక్షణ సేన రైతాంగం పక్షాన పోరాటం చేస్తుందని. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రైతుల కన్నీళ్లు తుడిచే చర్యలు చేపట్టాలి. కరీంనగర్ ను కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలి తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కుతాడి శ్రీనివాస్, నియోజకవర్గం మహిళ విభాగం అధ్యక్షురాలు బశేట్టి కృష్ణవేణి, జిల్లా పార్టీ నాయకులు శ్రీరాముల రమేష్, మడిపల్లి వినీత్, జంగ అపర్ణ తదితరులు ఉన్నారు.