రాష్ట్రాల ప్రగతితోనే దేశాభివృద్ధి

29-10-2026 | 09:12pm

హైదరాబాద్‌: తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, భారీ అభివృద్ధి లక్ష్యాల దిశగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్(Union Minister Piyush Goyal) అభినందించారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ ఆర్థిక పురోగతి సాధ్యమని స్పష్టం చేశారు.

తెలంగాణలో అంతర్జాతీయ పెట్టుబడులను(International investments) ఆకర్షించే లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌’(Invest Telangana Global Summit) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు పెట్టుబడిదారులు, వివిధ దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో పనిచేయాలని పీయూష్ గోయల్ సూచించారు. అన్ని రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వస్తేనే దేశ ఎగుమతులకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. తమ అభివృద్ధి ప్రణాళికలు, లక్ష్యాలను రాష్ట్రాలన్నీ ఒకే వేదికపై వెల్లడించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెరుగుతున్నాయని వివరిస్తూ, తాండూరు కందిపప్పు ఎగుమతుల అంశాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడం, ఎగుమతులను విస్తరించడం, రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలు గ్లోబల్ సమిట్‌లో కీలకం కానున్నాయి. ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సు ద్వారా తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రాల ప్రగతే దేశ ప్రగతికి పునాది అన్న సందేశంతో.. తెలంగాణ పెట్టుబడుల లక్ష్యాలపై కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడం గ్లోబల్ సమిట్‌కు ప్రాధాన్యం తీసుకొస్తోంది.

మరిన్ని వార్తలు