'వందేమాతరం' ఆలాపన ప్రారంభం

02-10-2026 | 02:00pm

ముకరంపుర, అక్టోబర్ 2(విజయ క్రాంతి): కరీంనగర్‌లోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య కూడలి అయిన టవర్ సర్కిల్‌లో టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోనే మొదటిసారిగా టవర్ మీద పూర్తి స్థాయి 'వందేమాతరం' గీతాలాపన(Vande Mataram Anthem) కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై, ప్రతిరోజూ ఉదయం 8:00 గంటలకు ప్రసారమయ్యే ఈ పూర్తి స్థాయి వందేమాతర గీతాలాపనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వందేమాతరం నినాదం కోట్లాది మంది త్యాగధనులలో దేశభక్తి ఉప్పొంగేలా చేసిందని, నేటి తరం యువత మరియు నగర పౌరులలో అదే జాతీయ స్ఫూర్తిని నింపడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఉదయాన్నే నగరంలో ప్రసారమయ్యే ఈ గీతాలాపన ద్వారా ప్రజలలో సానుకూల దృక్పథం, మానసిక ప్రశాంతత మరియు దేశం పట్ల అంకితభావం పెంపొందుతాయని స్పష్టం చేశారు. పూర్తి వందేమాతరం గీతాన్ని వినిపించేలా టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేసిన ఏర్పాట్లు నగరానికే తలమానికమని కొనియాడారు.

ఈ గీతం ప్రారంభమైనప్పుడు నగర పౌరులు, వ్యాపారులు, వాహనదారులు ఎక్కడికక్కడ గౌరవసూచకంగా నిలబడి జాతీయ భావాన్ని చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగల పవన్, రామన్, టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టవర్ సర్కిల్ ప్రాంతానికి చెందిన వైశ్య సోదరులు, మహిళా సోదరీమణులు మరియు నగర పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు