73వ రాష్ట్ర మహిళా కబడ్డీ టోర్నమెంట్
33 జిల్లాల నుంచి 33 జట్లు.. 550 మందికి పైగా క్రీడాకారులు రాక
28న ప్రారంభం.. 30న బహుమతుల ప్రదానోత్సవం
సత్తుపల్లి: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లిలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు 73వ రాష్ట్ర మహిళా కబడ్డీ టోర్నమెంట్(73rd Womens State Kabaddi Tournament) నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ (TGIDC) మాజీ ఛైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) మాజీ ఛైర్మన్, ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు మువ్వ విజయబాబు వెల్లడించారు.
సత్తుపల్లిలోని రాణి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 33 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయని తెలిపారు. దాదాపు 550 మంది క్రీడాకారులు, కోచ్‌లతో పాటు వివిధ జిల్లాలకు చెందిన అధికారులు, ఫిజికల్ డైరెక్టర్లు కలిపి 200 మందికి పైగా ఈ మూడు రోజుల పాటు సత్తుపల్లిలో బస చేయనున్నట్లు వివరించారు.
28న ప్రారంభోత్సవం
ఈ నెల 28వ తేదీ ఉదయం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మహిళా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీలు వేదిక కానున్నాయి.
30న బహుమతుల ప్రదానోత్సవం
ఈ నెల 30వ తేదీన జరిగే ముగింపు, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీల నిర్వహణతో సత్తుపల్లికి క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు, వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, అధికారుల రాకతో పట్టణంలో సందడి నెలకొననుంది.