వేంసూరు బీఆర్ఎస్ పోరుబాట

09-09-2026 | 12:49pm

కాంగ్రెస్ ప్రభుత్వంపై సండ్ర వెంకట వీరయ్య ఫైర్

వేంసూరు. సత్తుపల్లి. సెప్టెంబర్ 9. (విజయ క్రాంతి): వేంసూరు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు పై జరిగిన ప్రభుత్వ దాడిని ఖండిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వేంసూరు మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో*మర్లపాడు పార్టీ కార్యాలయం నుంచి వేంసూరు వరకు నల్ల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. 

ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్‌కు తెలంగాణ శాసనసభ, స్పీకర్ పదవి పట్ల పూర్తి గౌరవం ఉందని, స్పీకర్‌ను లేదా శాసనసభను అవమానించడం తమ పార్టీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ఉందని.సండ్ర అన్నారు. పార్లమెంట్‌లో నల్ల దుస్తులతో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపిన సందర్భాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు నల్ల దుస్తులతో నిరసన తెలిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో బీఆర్ఎస్ నేతలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నది బీఆర్ఎస్ ఆరోపణ కాగా, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సండ్ర డిమాండ్ చేశారు.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని. సండ్ర విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు స్కూటర్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌లో తులం బంగారం, పేదలకు ఇళ్లు వంటి హామీలను నెరవేర్చాలని కోరారు.

రైతు భరోసా, రైతు బీమా, యూరియా సమస్యలపై కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, దళితులు సహా అన్ని వర్గాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు.ప్రజా సమస్యలు, హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాటం ఇక్కడితో ముగియదని.. మరింత ఉధృతం చేస్తామని సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నిరసనకు తరలివచ్చిన మహిళలు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు