ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు
సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి
ఐక్యతా ప్రతిజ్ఞ చేసిన అధికారులు, కార్మికులు, సిబ్బంది
ప్రధాన అధికారి ఎస్. వెంకటాచారి ఆధ్వర్యంలో వేడుకలు
సత్తుపల్లి,(విజయక్రాంతి): భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) జయంతిని పురస్కరించుకుని సింగరేణి సంస్థ సత్తుపల్లి ప్రాంత పరిధిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను(National Unity Day celebrations) అత్యంత ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి ప్రాంత ప్రధాన అధికారి ఎస్. వెంకటాచారి ఆధ్వర్యంలో అన్ని గనులు, విభాగాలు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది, కార్మికులు దేశ సమగ్రతను, అంతర్గత భద్రతను కాపాడతామని ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్. వెంకటాచారి మాట్లాడుతూ... దేశ విలీనంలో, అఖండ భారత నిర్మాణంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. దేశ ఐక్యతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన సమక్షంలో ఉద్యోగులందరూ జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
సత్తుపల్లి ప్రాంత పరిధిలోని ప్రతిష్ఠాత్మక జలగం వెంగళరావు ఓపెన్‌కాస్ట్ (జేవీఆర్ ఓసీ), కిష్టారం ఓపెన్‌కాస్ట్, జేవీఆర్ బొగ్గు రవాణా కేంద్రం (సీహెచ్‌పీ), జేవీఆర్ వైద్యశాలతో పాటు అన్ని విభాగాల్లో ఆయా విభాగాల అధిపతుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో కార్మికులు, వైద్య సిబ్బంది, రక్షణ సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ రక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు. ఈ వేడుకల్లో సత్తుపల్లి ప్రాంతంలోని వివిధ విభాగాల అధికారులు, గనుల ప్రాజెక్టు అధికారులు, నిర్వాహకులు, వైద్యులు, పర్యవేక్షకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.