రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో కేబుల్స్ చోరీ!

13-10-2026 | 08:00pm

రూ.10 లక్షల విలువైన కేబుల్స్ అపహరణ.. ఆరు నెలల క్రితం రూ.5 లక్షల నష్టం..

వరుస చోరీలతో ఆందోళనలో నిర్వాహకులు.. పోలీసులకు ఫిర్యాదు..

ఎర్రుపాలెం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మండల పరిధిలోని రాజుపాలెం(Rajupalem) గ్రామంలోని మణితేజ–లక్ష్మి 2.4 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ ఘటన కలకలం రేపింది. సుమారు రూ.10 లక్షల విలువైన కేబుల్స్ అపహరణకు గురైనట్లు ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ప్లాంట్‌లోని 200 మీటర్ల ఆర్ ఎస్ 485 కేబుల్‌తో పాటు 2,000 మీటర్ల కేబుల్స్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. గతంలోనూ ఇదే ప్లాంట్‌లో సుమారు ఆరు నెలల క్రితం రూ.5 లక్షల విలువైన డిసి  కేబుల్స్ చోరీకి గురయ్యాయని తెలిపారు. అప్పట్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ,ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతోనే మరోసారి చోరీ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస చోరీలతో తీవ్రంగా నష్టపోతున్నాం.

స్వచ్ఛమైన, పర్యావరణహితమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సమాజానికి అందించాలనే లక్ష్యంతో సోలార్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నామని బాధితులు తెలిపారు. అయితే, వరుస చోరీల కారణంగా భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్స్ అపహరణతో విద్యుత్ ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు.

ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి, సమగ్ర విచారణ జరిపి చోరీకి పాల్పడిన వారిని గుర్తించాలని బాధితులు కోరారు. చోరీకి గురైన కేబుల్స్‌ను రికవరీ చేసి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్లాంట్‌కు తగిన భద్రత కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు